Geetha Koumudi-1    Chapters   

గీ తా కౌ ము ది

ఒకటవ కిరణము

గీ తా ఆ వ శ్య క త

'ప్రయోజన మనుద్దిశ్యనమందోపి ప్రవర్తతే'

అను న్యాయము ప్రకారము ఏ ప్రయోజనము లేకుండా ఎంత తెలివితక్కువాడు అయిననూ ఏ పనిని చేయడు. అనగా ప్రపంచములో ప్రతి మానవుడును ఏదోపనిని చేయుచున్నాడు అంటే, దానివలన ఏదో ప్రయోజనము కలుగు ననే చేయుచున్నాడు. అటువంటి అపుడు మనము ఎవరినైనా గీతను చదువమంటే యీగీతను చదివితే ఏమిలాభము?చదవకపోతే ఏమినష్టము? అని సహజముగా వాడు అడుగును. గీతను చదివితే యీ లాభము ఉన్నది? చదవకపోతే యీ నష్టము ఉన్నది అని వానిని ఒప్పించుతే వాడు గీతను చదువుతాడు. కనుక గీతను చదువుతే ఏమిలాభమో, చదవకపోతే ఏమినష్టమో మనము తెలుసుకొందము.

ప్రతి మానవుడును దుఃఖము పోవలెనని, సుఖము రావలెనని కోరుకొనును. కాని వాడు ఎన్నిపనులు చేసినను దుఃఖము పోవుటలేదు. సుఖము రావడములేదు. మనకు ప్రపంచ విషయములవల్ల ఏదో సుఖము వచ్చుచున్నదిగదా అంటే, ఆ సుఖము తాత్కాలికము, అనిత్యము, సోపాధికము (అనగా ఆయావస్తువుల మీద ఆధారపడినదై యున్నది.) అట్టి అనిత్యమై, సోపాధికమైన సుఖమువల్ల ఏమి ప్రయోజనము లేదు. అందుచేత ప్రతివాడును నిజముగా అపేక్షించేది, ఇట్టి ప్రపంచ విషయములమీద ఆధారపడిన అనిత్యసుఖము కాదు. ప్రపంచ వస్తువులు అన్ని అనిత్యములు కనుక వాటివల్ల వచ్చు సుఖము అనిత్యము కాకతప్పదు. కనుక ప్రతివాడును నిజముగా అపేక్షించేది ప్రపంచ వస్తువులమీద ఆధారపడనటువంటి నిత్యసుఖము. అట్టి నిత్యసుఖమునే ఆత్మానందము అంటారు. ప్రతి మానవుని ఆత్మ నిత్యమై ఆనందమై ఉన్నది, అని ఉపనిషత్‌ చెప్పుచున్నది. అంతేగాక మనకందరికి నిద్రలో కలిగె ఆనందము ఆత్మానందమే. నిద్రలో ప్రపంచ వస్తువులు ఇంద్రియములు, మనస్సు ఏమీ గోచరింపవుగదా, నిద్రలో ఉన్నది ఆత్మ ఒక్కటే. కనుక నిద్రలో మనము అనుభవించు ఆనందము ఆత్మానందమే. మన ఆత్మ అనగా మన స్వరూపమే. నిత్యమై ఆనందమై ఉన్నది. కాని మనకు ఆవిషయము తెలియుట లేదు; తెలియకపోగా యీ దుఃఖము అనుభవించుచున్నామనియు, ఆ దుఃఖము అనుభవించుచున్నామనియు ప్రతివాడు గోల పెట్టును. ఈ దుఃఖము పోవాలని ఎంత ప్రయత్నించినను దుఃఖము పోవడము లేదు. ఎందుచేతనంటే, దుఃఖము ఎందుకు వచ్చినదో తెలియక పోవడమువల్ల ఆ దుఃఖమును పోగొట్టుకోలేకుండా ఉన్నాడు. కనుక దుఃఖమును పోగొట్టు కొన వలెనంటే దుఃఖము ఎందుకు వచ్చినది, దేనివల్ల వచ్చినది తెలుసుకోవలయును. ఈవిధముగా దుఃఖమునకు కారణము ఏమి? అని విచారణ చేస్తే, శరీరమే దుఃఖమునకు కారణమని తేలుతుంది. ఎందుచేతనంటే, మనము శరీరము ఉన్నప్పుడే దుఃఖమును అనుభవిస్తున్నాము. శరీరమునకు రోగము వచ్చినా, తేలుకుట్టినా, మనకు దుఃఖము వచ్చును. కాని శరీరమునకు రోగము ఉన్నప్పటికి, శరీరములో తేలుకుట్టిన విషము ఉన్నప్పటికి మనకు నిద్రపట్టినయెడల ఏదుఃఖమును మనము అనుభవించుటలేదు. ఎందుచేతనంటేనిద్రలో మనకు శరీరము లేదు; అనగా శరీరము ఉన్నదనే భావము లేదు. శరీరము అనగా స్థూలశరీరము సూక్ష్మశరీరము కూడా, సూక్ష్మ శరీరమంటే మనస్సు ప్రధానముగా గలది. ఇపుడు దీనివలన తేలినది ఏమంటే, శరీరమున్న జాగ్రదవస్థలో దుఃఖము ఉన్నది; శరీరములేని నిద్రావస్థలో దుఃఖము లేదు; కనుక శరీరమే దుఃఖమునకు కారణము అని తేలినది. దుఃఖము లేకుండా పోవాలంటే శరీరము లేకుండా పోవాలి, శరీరము లేకుండా పోవాలంటే, శరీరము ఎందుకు వచ్చినదో, ఏలా వచ్చినదో తెలుసుకోవాలి. శరీరము ఎందుకు వచ్చినదంటే, వెనకటి జన్మలో ఏదోకర్మ చేస్తే, ఆకర్మ ఫలాన్ని అనుభవించుటకు శరీరము వచ్చినది. శరీరము లేకుండా పోవాలి అంటే కర్మ లేకుండా చేసుకోవాలి. కర్మ లేకుండా చేసుకోవాలి అంటే కర్మ ఎందుకు చేసినామో తెలుసుకోవాలి. కర్మ ఎందుకు చేసినామంటే రాగ ద్వేషాలు, కామక్రోధాలు ఉండుటవల్ల కర్మచేస్తున్నాము. మనము ఏపనిచేసినా రాగమో, ద్వేషమో, కామమో, క్రోధమో, మనలో ఉండి ఆపనిని చేయించుచున్నది. కనుక మనము ఏకర్మ చేయకుండా ఉండాలి అంటే రాగద్వేషములు కామక్రోధాలు లేకుండా ఉండాలి. ఇవి లేకుండా ఉండాలి అంటే, యివి ఎలా వచ్చినది తెలుసుకోవాలి. ఇవి ఎలా వచ్చినవంటే స్వపరభేదమువల్ల వచ్చినవి. నేను వేరు, వాడు వేరు అను భేదబుద్ధి ఉంటేనే యితరుని యందు రాగము, ద్వేషము, కామము, క్రోధము పుట్టును. ఈరాగాదులు పోవాలి అంటే స్వపరభేదము పోవాలి. స్వపరభేదము పోవాలి అంటే, స్వపరభేదము ఏలావచ్చినదీ తెలుసుకొంటే దానిని పోగొట్టుకోవచ్చును. స్వపరభేదము ఏలా వచ్చిన దంటే ఎవరి స్వరూపము వారికి తెలియక పోవుటవల్ల అనగా ఆత్మస్వరూపజ్ఞానము లేనందువల్ల ఈ శరీరములో ఉన్న వానిని 'నేను' అనిన్నీ, ఆ శరీరములో ఉన్నవానిని 'వాడు' అనిన్నీ అంటున్నాము. అందుచేత నేను వేరు వాడు వేరు అను భేదబుద్ధి; దానివల్ల రాగ ద్వేషాదులు; దానివల్ల కర్మ, దాని వల్ల శరీరము; దానివల్ల దుఃఖము వస్తున్నవి. ఈవిధముగా విచారణ చేస్తే దుఃఖానికి కారణము ఆత్మజ్ఞానము లేకపోవడము అని తేలినది. ఇది అంతా మనము ఇపుడు యుక్తి మీద విచారణచేసి తేల్చుకున్నాము. ఈ విషయమునే శ్రుతి కూడా నొక్కి చెప్పుచున్నది. 'ఛాందోగ్యోపనిషత్తు' లో నారదులవారికి సనత్‌ కుమారులవారు 'తరతీశోక మాత్మవిత్‌' అని బోధించినారు. అనగా ఆత్మజ్ఞానము వల్లనే దుఃఖమును దాటగల్గుతాడు అని సిద్ధాంతము. నిద్రలో ఆత్మ ఒక్కటే ఉన్నపుడు దుఃఖము లేకపోవుట వల్ల పై సిద్ధాంతము అనుభవపూర్వకముగా కూడా తేలుచున్నది. సమాధి స్థితిలో యీ విషయము స్పష్టముగా అనుభవములోనికి వచ్చును. ఇట్లు ఆత్మజ్ఞానము లేనందువల్ల దుఃఖము వచ్చినదనిన్నీ ఆత్మజ్ఞానమువల్ల దుఃఖముపోయి నిత్యానందము అనుభవములోనికి వచ్చుననిన్ని, యుక్తి విచారణవల్ల శ్రుతి ప్రమాణమువల్ల అనుభవమువల్ల కూడా మనము స్పష్టముగా తేల్చుకొన్నాము.

ప్రతి మానవుడున్ను 'నేను' 'నేను' అని వ్యవహరిస్తూ ఉంటాడు. నేను అంటే ఏమిటో తెలియడము లేదు. నేను అనేది లేదేమో అంటే నేను లేకపోవడము ఏమిటండి అని ప్రతివాడును రొమ్ముమీద చేయి వేసుకొని, నేను అనేది ఉన్నదని స్పష్టముగా ఉద్ఘోషిస్తాడు. కనుక నేను అనేదిలేక పోవడము లేదు. ఉన్నది అనడము నిశ్చయము. నేను అనేది ఉండుట అలా నిశ్చయమైతే నేనుయొక్క స్వరూపము తెలియుచున్నదాఅంటే, ఎవరికి తెలియుట లేదు,'నేను' యొక్క స్వరూపాన్ని తెలుసుకొన్న జ్ఞానులు చాలా అరుదు 'నేను' స్వరూపాన్ని తెలుసుకొని అనుభవములోనికి తెచ్చుకొనుట మోక్షము. నేను అనేది ఉన్నదని సామాన్యాకారముగా అందరికి తెలిసిననూ విశేషాకారముగ అందరికి తెలియడము లేదు. అనగా 'నేను' యొక్క స్వరూప స్వభావములు తెలియుట లేదు. దీనికి కారణ మేమనగా 'నేను' అనుదానిని ఏదో ఒకటి ఆవరించి కప్పివేసినది. అందుచేతనే "నేను' యొక్క స్వరూప స్వభావములు తెలియడములేదు. 'నేను' స్వరూపాన్ని ఆవరించిన దానిని మాయ అని అంటారు. ఆ మాయను పోగొట్టుకోగలిగితే 'నేను' యొక్క స్వరూపస్వభావములు తెలియును. అదే ఆత్మజ్ఞానము. అదే మోక్షము.

అలా అయితే యీ మాయను దాటుటకు సాధనమేమి ? అనగా అట్టి సాధనలను యీ భగవద్గీత బోధించుచున్నది. గనుక గీతాబోధవలన మాయను దాటి మోక్షమును పొందుటకు అవకాశమున్నది. గీతాజ్ఞానము లేకపోతే సంసారదుఃఖము తప్పదు కనుక గీతా బోధ అవసరము.

Geetha Koumudi-1    Chapters